పొద్దుగూకింది బాగా మబ్బు క్రమ్మింది
వెలుగు కాస్తా సమసిపోతోంది
వేడి సెగలు వేసవల్లే రగులుతుంటే
అక్కడక్కడ పిడుగుపాటుకు తూట్లు పడుతుంటే
అసురధ్వనిలో ఆర్తనాదం అనిగిపోతుంది
అనగద్రొక్కే ఉక్కుపాదం అడుగులేస్తోంది
అన్నెమెరుగని చిన్న ప్రాణులు చితికిపోతుంటే
తెగల సెగల మంటలోన
మానవత్వం మాడిపోతుంది
మనిషినే మరి మనిషి చూసి వణికిపోతుంటే
కడుపు కోసం కోరలెత్తే క్రూర మృగములు
కాస్త కూడా కరుగ రాని కొండరాళ్ళు
జాలి పడుతున్నాయ్ సోలిపోతున్నాయ్
కుళ్ళిపోయిన తోటలోని మల్లెపూలే
ఎర్రబడుతున్నాయ్ రగతమవుతున్నాయ్
మతాలేమో తలో దారికి పరుగులెడుతింటే
కులాలేవో కొత్త జెండా లెత్తబోతుంటే
భవితకే చరిత మనము స్మరణకీయాలి
ఎవరికెవరు ఎవరుగాక
చివరికెవరై మనము బ్రతకాలి
====================
య. వెంకటరమణ
No comments:
Post a Comment